
భారత రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. మొదటిసారి ప్రైవేటు రంగంలో ఆర్బిటాల్ క్లాస్ రాకెట్‌ను భారత్ విజయవంతంగా నింగిలోకి పంపింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి శనివారం ఈ రాకెట్‌ను ప్రయోగించారు. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ దీనిని రూపొందించింది. అయితే, 46 ఏళ్ల కిందట ఇదే రోజున భారత్ తొలి స్వదేశీ శాటిలైట్ లాంచ్ వెహికల్‌ను విజయవంతంగా ప్రయోగించింది. నాటి మిషన్‌కు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ నాయకత్వం వహించారు.
భారత అంతరిక్ష చరిత్రలో మైలురాయిగా నిలిచిన SLV-3కి, ఈ విక్రమ్-1 కి మధ్య ఉన్న సంబంధాలు కేవలం తేదీతోనే ముడిపడలేదు. నాటి SLV-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ మన మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వ్యవహరించడం విశేషం. విక్రమ్-1 ద్వారా స్కైరూట్ సంస్థ ఆయనకు ఘన నివాళులు అర్పించింది. ఈ రాకెట్‌లోని మూడు ఘన-ఇంధన దశలకు ఆయన జ్ఞాపకార్థం కలాం-1200, కలాం-250, కలాం-100 అని పేర్లు పెట్టడమే కాకుండా.. ఆయన సూక్ష్మ కళాఖండాన్ని కూడా ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపారు.

