
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమల పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరాన్ని బట్టి ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని ఆదేశించారు.
చిన్నారులు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగ్‌ల పంపిణీని విస్తృతంగా చేపట్టాలని సూచించారు. విద్యుత్ కేబుళ్లు, తాత్కాలిక విద్యుత్ వ్యవస్థల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
ముఖ్యంగా గరుడ వాహనం, చక్రస్నానం రోజుల్లో భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వెంకయ్య చౌదరి సూచించారు.
ఈ సందర్భంగా తిరుపతి జేఈవో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల్లో 25 రాష్ట్రాలకు చెందిన కళా బృందాలతో పాటు సింగపూర్, జర్మనీ నుంచి కూడా కళా బృందాలు పాల్గొనేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
సమీక్ష సమావేశంలో టీటీడీ జేఈవో డాక్టర్ ఏ. శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు.

