
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతికి సంబంధించి శుభవార్త వినిపించారు. అమరావతిలో ఈ నెలలోనే రెండు కీలక ప్రారంభాలు జరగనున్నట్లు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకర్లతో చిట్ చాట్ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. మరోవైపు అమరావతిలో ఇప్పటికే సీఆర్డీఏ భవనం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి రానున్నాయి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్తలు వినిపించారు. ఆగస్ట్ నెలలో అమరావతిలో రెండు కీలక ప్రారంభాలు జరుగుతాయని చంద్రబాబు తెలిపారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభంతోపాటుగా.. అమరావతి లో నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. అమరావతి పనులు వర్షాకాలంలోనూ వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ పార్టీ ఆఫీసులో చంద్రబాబు విలేకర్లతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలోనే అమరావతిలో ఆగస్టు నెలలో రెండు ప్రారంభాలు చేయనున్న విషయాన్ని చంద్రబాబు వెల్లడించారు.
అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు ..మరోవైపు రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో సీడ్ యాక్సె్స్ రోడ్డును ఈ నెల 13న ప్రారంభిస్తారంటూ వార్తలు వస్తున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి అయితే ప్రకాశం బ్యారేజీ నుంచి కరకట్ట మీదుగా వేగంగా అమరావతికి చేరుకోవచ్చు. సీడ్ యాక్సెస్ రోడ్డు 21 కిలోమీటర్ల మేరకు నిర్మించారు. ఫేజ్ 1 కింద 14.35 కిలోమీటర్లు, ఫేజ్ 2 కింద 3.92 కిలోమీటర్లు, ఫేజ్ 3 కింద 3.51 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్
మరోవైపు అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం క్వార్టర్స్ నిర్మించారు. 12 అపార్టుమెంట్ టవర్ల నిర్మాణం పూర్తి అయ్యింది. వీటిని త్వరలోనే సాధారణ పరిపాలన శాఖకు అప్పగించనున్నారు. ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌లను కూడా ఆగస్టు నెలలోనే ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మొత్తంగా అమరావతిలో ఇప్పటికే సీఆర్డీఏ భవనం అందుబాటులోకి రాగా.. ఇప్పుడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి రానుంది. దీంతో అమరావతి నిర్మాణ పనులలో కీలక ప్రారంభోత్సవాలకు ఆగస్ట్ నెల వేదిక కానుంది. మరోవైపు 2028 నాటికి అమరావతి తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్తున్న సంగతి తెలిసిందే. ఆ దిశగా నిర్మాణ పనులలో వేగం పెంచారు.

