
వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోలు పడటంతో సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఎంతవరకు మెప్పించింది? తెలుసుకుందాం.
కథ
పెనుగొండకు చెందిన కోపిష్టి కుర్రాడు కనకరాజు (వరుణ్ తేజ్). ఓ చెక్క భజన బృందాన్ని నడిపే అతడికి స్నేహితుడు కిష్టప్ప (సత్య) అండగా ఉంటాడు. కిష్టప్ప నిర్వహించే ఫొటో స్టూడియోనే ఆ బృందానికి అడ్డాగా ఉంటుంది. మరోవైపు గ్రామంలోని మునుస్వామి (చిన్నా)తో కనకరాజుకు తరచూ గొడవలు జరుగుతుంటాయి.
స్థానిక కియా కంపెనీలో పనిచేస్తున్న చైత్ర (రితికా నాయక్)కు కొరియా వెళ్లాలనే కల ఉంటుంది. ఆమెతో కనకరాజు ప్రేమకథ సాఫీగా సాగుతున్న సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంటుంది. కొరియాలో మరణించిన ఓ గ్యాంగ్‌స్టర్ అస్థికలు అనుకోకుండా పెనుగొండకు చేరుకుంటాయి. అవి కనకరాజు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి.
ఆ డాన్ ఆత్మ కనకరాజు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఏం జరిగింది? ఆ గ్యాంగ్‌స్టర్ గతం ఏమిటి? కనకరాజు, చైత్ర, కిష్టప్పలు కొరియాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే..
సాధారణ దెయ్యం కథకు కొరియన్ టచ్ జోడించి పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కించడంలో దర్శకుడు మేర్లపాక గాంధీ తన మార్క్ చూపించారు. లాజిక్‌లను పక్కన పెడితే.. ప్రేక్షకులను నవ్వించడంలో సినిమా చాలావరకు సక్సెస్ అవుతుంది.
కొరియా నేపథ్యంలో ప్రారంభమయ్యే కథ పెనుగొండకు మారిన తర్వాత కొంత సాదాసీదాగా సాగుతుంది. అయితే కొరియన్ దెయ్యం కనకరాజు శరీరంలోకి ప్రవేశించినప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.
ద్వితీయార్థంలో స్టైలిష్ టేకింగ్‌తో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సత్య కామెడీ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది. అతడి కామెడీ టైమింగ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. ఇటీవల వైరల్ అయిన ఓ ట్రెండింగ్ డైలాగ్‌ను సినిమాలో ఉపయోగించిన విధానం కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తుంది.
క్లైమాక్స్‌లో కొన్ని సన్నివేశాలు ఏఐ సాయంతో రూపొందించినట్లు కనిపించినా.. సత్య కామెడీ ఆ లోపాన్ని చాలావరకు కవర్ చేస్తుంది. మొత్తంగా లాజిక్‌లను వెతక్కుండా, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకులకు ‘కొరియన్ కనకరాజు’ మంచి టైమ్‌పాస్‌గా అనిపిస్తుంది.

