రాజమండ్రిలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక ప్రస్తుతం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వైద్యులు బ్రెయిన్‌డెడ్ పరిస్థితిపై కుటుంబ సభ్యులకు వివరించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో చివరి ప్రయత్నంగా అప్నియా టెస్ట్ నిర్వహించేందుకు వైద్యులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆమె శరీరంలో సోడియం స్థాయిలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్నియా టెస్ట్ నిర్వహించడానికి ముందు సోడియం స్థాయిలను నియంత్రించాల్సి ఉందని వైద్యులు భావిస్తున్నట్లు సమాచారం. ప్రియాంక ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

పాపం ప్రియాంక.. రాజమండ్రిలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. ఒక్క శాతం ఆశ ఉన్నా చాలు.. తమ బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలని కుటుంబం పడరాని పాట్లు పడుతోంది. వైద్యులు మాత్రం పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఆశలు చాలా తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ కుటుంబం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది.
అసలు ప్రియాంక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..? ఆమెకు ఏమైంది..? ప్రస్తుతం వైద్యులు ఎలాంటి చికిత్స అందిస్తున్నారు..? తెలుసుకుందాం.
పగవాడికి కూడా రాకూడదనిపించే కష్టం ప్రియాంక కుటుంబానికి వచ్చింది. కళ్లముందే కన్నబిడ్డ ఐసీయూలో ఉంది. శరీరంలో ప్రాణం ఉన్నా.. మెదడు మాత్రం పనిచేయని పరిస్థితి. తమను చూసి కళ్లు తెరిచి పలకరించాల్సిన కూతురిని.. తామే కన్నీళ్లతో చూస్తూ ఉండాల్సిన దుస్థితి ఆ తల్లిదండ్రులకు వచ్చింది.
ఒకవైపు వైద్యులు పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెబుతుంటే.. మరోవైపు తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డ తిరిగి కళ్లు తెరుస్తుందనే చిన్న ఆశను వదులుకోవడం లేదు. ఏదో ఒక అద్భుతం జరిగి ప్రియాంక మళ్లీ తమతో మాట్లాడుతుందేమోనని ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ప్రియాంకకు చికిత్స కొనసాగుతోంది. అక్కడికి ప్రతిరోజూ ఎంతో మంది వివిధ అనారోగ్య సమస్యలతో వస్తుంటారు. కానీ ప్రియాంక కుటుంబం పడుతున్న వేదనను చూసిన ప్రతి ఒక్కరి మనసు చలించిపోతోంది. తమకు తెలియని అమ్మాయి అయినా సరే.. ప్రియాంక కోలుకుని మళ్లీ తన కుటుంబం మధ్యకు చేరుకోవాలని అందరూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు.
ఆఖరి ప్రయత్నంగా అప్నియా టెస్ట్..
ప్రస్తుతం వెంటిలేటర్‌పై ప్రియాంకకు చికిత్స కొనసాగుతోంది. ఆమె పరిస్థితి దాదాపు బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరుకుందని వైద్యులు తల్లిదండ్రులకు వివరించినట్లు తెలుస్తోంది. మెదడు నుంచి శరీరంలోని ఇతర భాగాలకు నరాల ద్వారా స్పందనలు నిలిచిపోయిన పరిస్థితి ఉందని వైద్యులు తెలిపారు.
అయితే, ఆఖరి ప్రయత్నంగా వైద్యులు అప్నియా టెస్ట్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ప్రియాంక శరీరంలో సోడియం స్థాయిలు అధికంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సోడియం లెవల్స్ తగ్గిన తర్వాతే అప్నియా టెస్ట్ నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు.
అప్నియా టెస్ట్ పూర్తయి, దాని ఫలితాలు వచ్చిన తర్వాతే ప్రియాంక పరిస్థితిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అయినప్పటికీ.. ఏదో ఒక అద్భుతం జరిగి ప్రియాంక తిరిగి వస్తుందన్న ఆశతో కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.
అప్నియా టెస్ట్ అంటే ఏమిటి?
‘అప్నియా టెస్ట్’ అనే పదాన్ని రెండు వేర్వేరు వైద్య సందర్భాల్లో ఉపయోగిస్తారు. ఒకటి స్లీప్ అప్నియాను గుర్తించేందుకు చేసే పరీక్ష. నిద్రలో శ్వాస పదేపదే ఆగిపోవడం, తిరిగి ప్రారంభం కావడం వంటి సమస్యలను నిర్ధారించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
మరోటి అత్యవసర వైద్యంలో **మెదడు మరణం (Brain Death)**ను నిర్ధారించేందుకు నిర్వహించే ప్రత్యేక పరీక్ష. ఇందులో వెంటిలేటర్ సహాయంతో శ్వాస అందుతున్నప్పటికీ, స్వయంగా శ్వాస తీసుకునే సామర్థ్యం ఉందా లేదా అన్నది వైద్యులు నిర్ధారిస్తారు. మెదడు కాండం (Brain Stem)లోని శ్వాస నియంత్రణ కేంద్రం పనిచేస్తుందా లేదా తెలుసుకోవడంలో ఈ పరీక్ష కీలకంగా ఉంటుంది.
రిమాండ్‌లో నిందితులు
దశ్వంత్, జోసెఫ్ ప్రస్తుతం 14 రోజుల రిమాండ్‌లో ఉన్నారు. ప్రమాదం జరిగిన రోజున పోలీసులు వారిపై BNS 134/U, 125(b) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తొలుత ర్యాష్ డ్రైవింగ్‌గా భావించి కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సెక్షన్లను మార్చారు.
ప్రస్తుతం BNS 110 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రమాదం తెలిసీ, ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగా భావిస్తూ కేసులో తీవ్రతను పెంచినట్లు తెలుస్తోంది.

