
ఇన్నాళ్లూ ఉచితంగా కొనసాగుతున్న యూపీఐ లావాదేవీలపై ఇకపై ఛార్జీలు వసూలు చేయనున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా యూపీఐపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమలు చేస్తారనే వార్తలతో వినియోగదారుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. MDR అమల్లోకి వస్తే చిన్న వ్యాపారులు, కిరాణా షాపులు, వీధి వ్యాపారులపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందనే ఆందోళన ఉంది. అయితే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ (సవరణ) బిల్లు, 2026 నేపథ్యంలో యూపీఐ వినియోగదారులు, వ్యాపారుల నుంచి త్వరలో ఛార్జీలు వసూలు చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించే ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏదైనా రుసుము విధించినప్పటికీ దాని ప్రభావం నేరుగా వినియోగదారులపై పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది.
పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) ప్రకారం.. యూపీఐ సేవలను ఉపయోగిస్తున్నందుకు వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీ వసూలు చేసే ప్రతిపాదన ప్రస్తుతం లేదు. అలాగే కిరాణా దుకాణాలు, ఐస్క్రీమ్ విక్రయదారులు, చిన్న వ్యాపారులు యూపీఐ చెల్లింపులు స్వీకరించినందుకు MDR చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. 2016లో ప్రారంభమైన యూపీఐ సేవలు ఉచితంగా అందుబాటులో ఉండటంతో దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం భారీగా పెరిగింది.
MDR అంటే ఏమిటి?
మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అనేది డిజిటల్ చెల్లింపులను ప్రాసెస్ చేసినందుకు వ్యాపారుల నుంచి బ్యాంకులు లేదా పేమెంట్ సర్వీస్ సంస్థలు వసూలు చేసే రుసుము. సాధారణంగా ఈ ఛార్జీ నేరుగా వినియోగదారులపై విధించబడదు. అయితే వ్యాపారులపై MDR భారం పెరిగితే.. డిజిటల్ చెల్లింపులను స్వీకరించడంపై వారు ఆసక్తి కోల్పోయే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు MDR ద్వారా వచ్చే ఆదాయాన్ని డిజిటల్ పేమెంట్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సైబర్ సెక్యూరిటీ, చెల్లింపు వ్యవస్థల నిర్వహణకు ఉపయోగించవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మర్చంట్ సర్వీస్ ఛార్జీలు అనేవి వ్యాపారులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య కుదిరే వాణిజ్య ఒప్పందాలకు సంబంధించినవని PCI వెల్లడించింది.
ప్రస్తుతం యూపీఐపై ఛార్జీలకు ప్రతిపాదన లేదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో వినియోగదారులకు కొంత ఊరట లభించింది.

