
వైసీపీ నేతలపై ఏపీ మంత్రి టీజీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వర్గాలు రాజకీయ హత్యలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించిన మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
కర్నూలులో వైసీపీకి చెందిన రౌడీ మూకలు హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడుతూ అరాచకాలు సృష్టిస్తున్నాయని మంత్రి ఆరోపించారు. టీడీపీ కార్యకర్త ఇంతియాజ్‌ను పక్కా ప్రణాళికతో హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంతియాజ్ గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారని టీజీ భరత్ తెలిపారు. నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని అప్పట్లో వైసీపీ వర్గీయులు ఆయనను బెదిరించారని, ఇంటికి వెళ్లి గొడవకు దిగారని ఆరోపించారు. అనంతరం ఇంతియాజ్ టీడీపీలో చేరారని చెప్పారు.
హంద్రీనదిలో వైసీపీ వర్గాల కబ్జాలను ఇంతియాజ్ బయటపెట్టారని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకునే ఆయనను దారుణంగా హత్య చేశారని టీజీ భరత్ ఆరోపించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

