
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో రూ.17 కోట్లతో చేపట్టిన 168 అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద యువతీ, యువకులను సన్మానించిన అనంతరం వారి చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనూ వివిధ ప్రాంతాల్లో యువతతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. యువత అభిప్రాయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.

