
అధికారాన్ని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో వైసీపీ ప్రతి అంశంపైనా బురదజల్లే రాజకీయాలు చేస్తోందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విమర్శించారు. ఆదివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికారంలో ఉన్న సమయంలో డీఎస్సీ అభ్యర్థుల సమస్యలను వైసీపీ ఏనాడూ పట్టించుకోలేదని నాని ప్రశ్నించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
2025 డీఎస్సీని ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించిందని ఆయన తెలిపారు. అయినప్పటికీ పరీక్ష నిర్వహణపై కోర్టుల్లో కేసులు వేయడం, కోర్టు సూచనలను పట్టించుకోకుండా మళ్లీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా నిరసనలు చేపట్టడం సరికాదన్నారు. వైసీపీ వైఖరి చూస్తుంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతోందని, మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారని నాని పేర్కొన్నారు. ఈ మార్పులను ఓర్వలేకే వైసీపీ విమర్శలు ఆందోళనలకు దిగుతోందని ఆరోపించారు.ఇదే విధంగా వ్యవహరిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కవని పులివర్తి నాని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఈశ్వర్ రెడ్డి, గణపతి నాయుడు, శ్రీధర్ నాయుడు, శీను, మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

