
నేతన్నల సేవలో పథకం కింద అర్హులైన ప్రతి నేతన్నకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించాలని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో పథకం అమలుపై ఆమె సమీక్ష నిర్వహించారు. మిగిలిపోయిన అర్హులను గుర్తించి త్వరితగతిన ఆర్థిక సాయం అందించాలని సూచించారు.
సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇటీవల నేతన్నల సేవలో పథకాన్ని ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 71,536 మంది నేతన్నలకు రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు. ఇంకా అర్హత ఉన్న వారికి కూడా వారం రోజుల్లోగా సాయం అందిస్తామని చెప్పారు.
నేతన్నల సేవలో పథకం కోసం 13,678 మంది దరఖాస్తు చేసుకున్నారని, వాటిని పరిశీలించి అర్హులను గుర్తిస్తామని మంత్రి తెలిపారు. అర్హత ఉన్న వారికి నేతన్నల నేస్తం పథకాన్ని వర్తింపజేస్తామని పేర్కొన్నారు.
నేతన్నలకు ఆర్థికంగా అండగా నిలవడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని సవిత అన్నారు. 50 ఏళ్లు నిండిన 85,678 మంది చేనేత కార్మికులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. అలాగే 62,541 మంది నేతన్నల కుటుంబాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. సమీక్ష సమావేశంలో చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

