
ఏపీ రాజధాని అమరావతి రూపురేఖలను మార్చే మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన సుమారు 1.10 కిలోమీటర్ల పొడవుతో ఆరు వరుసల ‘సిగ్నేచర్ బ్రిడ్జి’ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
ప్రకాశం బ్యారేజీకి సుమారు 300 మీటర్ల దిగువన, బ్యారేజీ–రైల్వే బ్రిడ్జి మధ్య ఈ వంతెన నిర్మించనున్నారు. విజయవాడ, అమరావతి మధ్య రాకపోకలను సులభతరం చేయడంతో పాటు.. రాజధానికి ఐకానిక్ గేట్‌వేగా, పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది.
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఈ వంతెనపై వాహనాల రాకపోకలతో పాటు పాదచారులు, సైక్లిస్టుల కోసం ప్రత్యేక ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు విజయవాడ, NH-65తో రాజధాని కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ప్రకాశం బ్యారేజీపై ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ రద్దీ కూడా కొంత తగ్గే అవకాశం ఉంది.
సిగ్నేచర్ బ్రిడ్జి డిజైన్ కోసం ఇప్పటికే నాలుగు నమూనాలను ప్రజల అభిప్రాయాల కోసం అందుబాటులో ఉంచారు. వీటిలో ఒకదాన్ని ఎంపిక చేసి తుది డిజైన్‌ను ఖరారు చేయనున్నారు.
ఈ ప్రాజెక్టును EPC విధానంలో చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎంపికైన కన్సల్టెన్సీ సంస్థ మూడు నెలల్లో కాన్సెప్ట్ డిజైన్, అంచనా వ్యయం, డీపీఆర్ వంటి వివరాలను సమర్పించనుంది. ప్రాజెక్టుకు అవసరమైన నిధుల కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సహకారాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

