
రాజధాని అమరావతిలో కీలక అభివృద్ధి పనులు అందుబాటులోకి వచ్చాయి. ఎప్పటినుంచో కొనసాగుతున్న సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు పూర్తికావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఈ రహదారిని ప్రారంభించారు. అలాగే రోడ్డుకు అనుసంధానంగా నిర్మించిన రెండు స్టీల్ బ్రిడ్జిలకు కూడా శ్రీకారం చుట్టారు.
అమరావతిని కలిపే ప్రధాన రహదారిగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డులో రాయపూడి–వెంకటపాలెం–పెనుమాక–ఉండవల్లి మార్గంలో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఉండవల్లి వద్ద స్టీల్ బ్రిడ్జిల ప్రారంభానికి సూచికగా సీఎం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మూడో దశలో మణిపాల్ వద్ద జాతీయ రహదారి-16కు అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందించారు.
మొత్తం రూ.1,519 కోట్ల అంచనా వ్యయంతో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ రహదారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో కరకట్టకు ప్రత్యామ్నాయంగా వాహన రాకపోకలకు మార్గం సుగమమైంది. విజయవాడ–మంగళగిరి మార్గంతోనూ సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించడంతో అమరావతికి రాకపోకలు మరింత వేగవంతం కానున్నాయి.
మూడు దశల్లో నిర్మిస్తున్న ఈ రహదారిని ఎన్-1 నుంచి ఎన్-17 వరకు ఉన్న ఎన్-సిరీస్ రహదారులతో అనుసంధానించారు. 1.77 కిలోమీటర్ల మేర నిర్మించిన రోడ్డు 60 మీటర్ల వెడల్పుతో ఉంది. ఇందులో సర్వీస్ రోడ్లు, ప్రత్యేక బీఆర్టీఎస్ కారిడార్, 9 లైన్ల రహదారితో పాటు సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేశారు.
ఇక బకింగ్‌హామ్ కాలువపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జి 110 మీటర్ల పొడవు, 9+9 మీటర్ల వెడల్పుతో ఉంది. కొండవీటి వాగుపై నిర్మించిన మరో స్టీల్ బ్రిడ్జి 284 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. ఈ రెండు వంతెనలు అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి అమరావతికి కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది.
సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభంతో అమరావతి రాజధాని ప్రాంతంలో రవాణా వ్యవస్థకు మరింత ఊతం లభించనుంది. భవిష్యత్‌లో ప్రజా రవాణాకు ఈ రహదారి కీలకంగా మారనుంది.

