
D news: ఏనుగులు భారత వన్యప్రాణి వారసత్వానికి ప్రతీకలని, పర్యావరణ సమతుల్యతలో వాటి పాత్ర కీలకమని ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.
‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ను మరింత బలోపేతం చేయడంతో పాటు ఏనుగుల కారిడార్ల రక్షణకు ప్రాధాన్యం ఇస్తామని పవన్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఏనుగుల కదలికలను పర్యవేక్షిస్తూ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ద్వారా మనిషి–ఏనుగు ఘర్షణలను తగ్గిస్తున్నామని చెప్పారు.
ఏపీలో ప్రస్తుతం సుమారు 132–142 అడవి ఏనుగులు ఉన్నాయని వెల్లడించారు. కర్ణాటక అటవీ శాఖ సహకారంతో నాలుగు కుంకీ ఏనుగులను రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రత్యేక శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. వీటి సహాయంతో ఇప్పటికే 15 ఘర్షణ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించినట్లు చెప్పారు.
వన్యప్రాణుల రక్షణ కోసం 100 ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చామని, ఇప్పటివరకు 200కుపైగా వన్యప్రాణులను రక్షించామని పవన్ కల్యాణ్ తెలిపారు. రైతులకు ముందస్తు హెచ్చరికలు, అటవీ సిబ్బందికి ఆధునిక పరికరాలు, శిక్షణతో పాటు వన్యప్రాణులకు సురక్షిత ఆవాసాల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.

