
D news: గుడివాడ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమీక్షించారు. గురువారం ప్రజా వేదిక కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశమైన ఆయన.. తక్కువ వోల్టేజీ సమస్యలు, నూతన లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్ల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు.
గత సమావేశంలో సూచించిన సమస్యల్లో 90 శాతానికి పైగా పరిష్కారం కావడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో గుడివాడ నియోజకవర్గంలో రూ.14 కోట్ల విద్యుత్ పనులు చేపట్టగా, మరో రూ.11 కోట్ల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రూ.1.52 కోట్ల పనులకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు.
నూతన సబ్స్టేషన్లు, ఫీడర్ల ఏర్పాటుపై విద్యుత్ శాఖ సీఎండీ పుల్లారెడ్డితో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు ఆక్వా రంగానికి విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాము తెలిపారు.

