
D news: ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై అధిక చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వులు ఉన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేసే హెచ్చరిక లేబుళ్లు తప్పనిసరి చేయడంపై కేంద్రం, FSSAI తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే తామే రంగంలోకి దిగాల్సి వస్తుందని గురువారం హెచ్చరించింది.
జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. “కార్పొరేట్ సంస్థల ఒత్తిళ్లకు లోబడి నిర్ణయాలు తీసుకుంటున్నారా?” అని కేంద్రం, FSSAIని ప్రశ్నించింది.
ప్యాక్‌డ్ ఫుడ్స్‌పై హెచ్చరిక లేబుళ్లను ఆహార పరిశ్రమ వ్యతిరేకిస్తోందని FSSAI తరఫున వాదనలు వినిపించగా.. పిటిషనర్ తరఫు న్యాయవాది దీనిని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మార్చి 7న జరిగిన FSSAI సమావేశం మినిట్స్‌లోని నిర్ణయాలు గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు.
అధిక చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వులు కలిగిన ఆహార పదార్థాలపై హెచ్చరిక లేబుళ్లకు బదులుగా.. రోజువారీ అవసరాల మేరకు వాటి పరిమాణాన్ని పట్టిక రూపంలో చూపించాలని FSSAI ప్రతిపాదించినట్లు వెల్లడించారు.
“ప్రజలు తాము ఏం తింటున్నారో తెలుసుకునే హక్కు ఉంది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన ఈ విషయంలో కార్పొరేట్ ఒత్తిళ్లకు ప్రభావితం కాకూడదు” అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్రం, FSSAI తగిన చర్యలు తీసుకోకపోతే తామే జోక్యం చేసుకుంటామని హెచ్చరించింది.

