
ఆంధ్రప్రదేశ్ విమాన ప్రయాణికులకు శుభవార్త. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి, కోల్కతా నగరాలకు కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్గా ఈ సర్వీసులను ప్రారంభించారు. ఇండిగో ఎయిర్లైన్స్ ఈ విమానాలను వారానికి మూడు రోజుల పాటు నడపనుంది.
ప్రతి మంగళవారం, గురువారం, శనివారం ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. వీటిలో ముఖ్యంగా విజయవాడ నుంచి వారణాసికి నేరుగా కేవలం రెండు గంటల్లో చేరుకునే సౌకర్యం ప్రయాణికులకు కల్పించారు.
ఫ్లైట్ నంబర్ 6E 6502 విజయవాడ నుంచి సాయంత్రం 6.20 గంటలకు బయల్దేరి రాత్రి 8.15 గంటలకు వారణాసి చేరుకుంటుంది. అనంతరం వారణాసి నుంచి బయల్దేరి రాత్రి 10.15 గంటలకు కోల్కతా చేరుతుంది. మరోవైపు 6E 6501 కోల్కతా నుంచి మధ్యాహ్నం 2.10 గంటలకు బయల్దేరి 3.55 గంటలకు వారణాసి చేరుకుంటుంది. అక్కడి నుంచి బయల్దేరి సాయంత్రం 5.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
విజయవాడ–వారణాసి విమాన టికెట్ ధర సుమారు రూ.6,500 నుంచి రూ.8,000 మధ్య ఉంటుందని ఇండిగో తెలిపింది. ఈ సర్వీసుకు సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
ఇప్పటికే విజయవాడ నుంచి వారణాసికి ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు ఉన్నప్పటికీ, ప్రయాణ సమయం ఎక్కువగా ఉంటుంది. తాజాగా ఇండిగో నేరుగా రెండు గంటల్లో వారణాసి చేరుకునే సర్వీసును ప్రారంభించడంతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది. ముఖ్యంగా వారణాసికి వెళ్లే భక్తులకు ఈ కొత్త విమాన సర్వీస్ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

