
D news: విజయవాడ: కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ జరిగిందన్న ఆరోపణలపై సిట్ దర్యాప్తు కొనసాగుతున్న వేళ.. వైసీపీ ఎంపీ గురుమూర్తి దాఖలు చేసిన ప్రైవేట్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ కోర్టులో జరుగుతున్న ప్రైవేట్ ఫిర్యాదుపై విచారణకు హైకోర్టు స్టే విధించింది.
కస్టోడియల్ డెత్ ఆరోపణల నేపథ్యంలో డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్, సౌత్‌జోన్ ఏసీపీలను నిందితులుగా చేర్చి విచారణ చేపట్టాలంటూ ఎంపీ గురుమూర్తి విజయవాడ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై విజయవాడలోని రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ చర్యలు చేపట్టారు.
ప్రైవేట్ ఫిర్యాదుపై ఎంపీతో పాటు ఆయన సూచించిన ఇతర సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసేందుకు మేజిస్ట్రేట్ చర్యలు తీసుకోవడాన్ని సౌత్‌జోన్ ఏసీపీ కె. మానస హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఇప్పటికే ఇదే వ్యవహారంపై సిట్ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, మరోవైపు ప్రైవేట్ ఫిర్యాదుపై విచారణ చేపట్టడం సముచితం కాదని అభిప్రాయపడింది.
సిట్ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో సమాంతరంగా ప్రైవేట్ ఫిర్యాదుపై విచారణ జరపడం న్యాయ ప్రక్రియ దుర్వినియోగానికి దారితీసే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. ఈ దశలో ప్రైవేట్ ఫిర్యాదుపై తదుపరి చర్యలు చేపట్టకుండా మేజిస్ట్రేట్ నియంత్రణ పాటించాల్సి ఉండేదని వ్యాఖ్యానించింది.
ఈ మేరకు ప్రైవేట్ పిటిషన్‌పై తదుపరి విచారణను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై. లక్ష్మణరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సిట్ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఎంపీ దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదుపై విజయవాడ కోర్టులో జరుగుతున్న ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

