
అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీలో మరోసారి కారుణ్య నియామకాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అనారోగ్య కారణాలతో మెడికల్ అన్‌ఫిట్ అయిన, మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగుల వారసులకు మొత్తం 76 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. ప్రభుత్వ అనుమతితో రవాణా శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
మొత్తం 76 మందిలో 43 మంది మెడికల్ అన్‌ఫిట్ అయి పదవీ విరమణకు అనుమతి పొందినవారు, మరో 33 మంది మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఉన్నారు. జిల్లాస్థాయి కారుణ్య నియామకాల కమిటీల ద్వారా త్వరలో నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్‌పై ఉద్యోగుల వినతి
మరోవైపు ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. హైదరాబాద్‌లో ఈపీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ శ్రీకాంత్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
సుమారు 6 వేల మంది ఉద్యోగుల తిరస్కరించిన హయ్యర్ పెన్షన్ దరఖాస్తులను జాయింట్ ఆప్షన్ కింద అనుమతించాలని కోరారు. అలాగే 2013, 2017 వేతన సవరణలను పరిగణనలోకి తీసుకుని హయ్యర్ పెన్షన్ లెక్కించాలని, 58 ఏళ్లు దాటిన ఉద్యోగుల నుంచి జమ చేసిన రూ.35 కోట్ల కంట్రిబ్యూషన్‌ను తిరిగి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
ఏపీఎస్‌ఆర్టీసీకి ప్రత్యేక పీఎఫ్ కోడ్ కేటాయించాలని కూడా కోరగా.. సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఈపీఎఫ్ కమిషనర్ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.

