
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కీలక సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోలవరం, వెలిగొండతో పాటు రాష్ట్రంలోని ప్రాధాన్యతా ప్రాజెక్టుల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల వారీగా పనుల పురోగతిని జలవనరుల శాఖ అధికారులు సీఎంకు వివరించారు.
89.9 శాతం పూర్తయిన పోలవరం పనులు
పోలవరం ప్రాజెక్టులో ఇప్పటివరకు 89.9 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఎడమ కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నామని, ఈసీఆర్ఎఫ్ (ECRF) డ్యామ్ గ్యాప్-1, గ్యాప్-2 పనులను కూడా వేగంగా చేపడుతున్నామని వివరించారు.
ఇటీవల 14 లక్షల క్యూసెక్కుల భారీ వరద ప్రవాహం వచ్చినప్పటికీ పనులకు అంతరాయం కలగకుండా కొనసాగించామని అధికారులు వెల్లడించారు.
గండి పోశమ్మ ఆలయ పరిరక్షణకు చర్యలు
పోలవరం పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. డ్యామ్ సైట్ వద్ద రహదారులు, ఇతర మౌలిక వసతుల పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టు సమీపంలోని గండి పోశమ్మ ఆలయాన్ని పరిరక్షిస్తూ, స్థానికుల మనోభావాలను గౌరవించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
36 ప్రాజెక్టులపై సమీక్ష
రాష్ట్రవ్యాప్తంగా 36 సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయడంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు, లోటు వర్షపాతం ఉన్న ప్రాంతాలు, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి సరఫరా, ‘జలధార-జలహారతి’ కార్యక్రమాల అమలుపై కూడా సీఎం సమీక్షించారు.
సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

