
చిత్తూరు జిల్లా: కన్నతండ్రి పెన్షన్ డబ్బుల కోసం కుమారుడు దారుణానికి పాల్పడ్డ ఘటన చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం క్షీరసముద్రం గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న యువకుడు గాఢ నిద్రలో ఉన్న తండ్రిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు.
క్షీరసముద్రం గ్రామానికి చెందిన 45 ఏళ్ల ఆనంద్ శారీరక వైకల్యంతో బాధపడుతున్నాడు. కుటుంబ కలహాల కారణంగా కొంతకాలంగా భార్య, పిల్లలు ఆయనకు దూరంగా ఉంటున్నారు. పెద్ద కుమారుడు జ్యోతిశ్వరన్ మద్యానికి బానిసై సుమారు పదేళ్ల క్రితమే తల్లిదండ్రులకు దూరంగా చిత్తూరులో ఉంటున్నాడు. అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి తండ్రితో డబ్బుల కోసం గొడవ పడేవాడని స్థానికులు తెలిపారు.
ఈ క్రమంలో గురువారం రాత్రి జ్యోతిశ్వరన్ మద్యం మత్తులో తండ్రి వద్దకు వచ్చి వికలాంగ పెన్షన్ డబ్బులు తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం ఆనంద్ నిద్రలోకి వెళ్లిన సమయంలో జ్యోతిశ్వరన్ కత్తితో దాడి చేశాడు. శరీరంపై పలు చోట్ల తీవ్ర గాయాలు కావడంతో అధిక రక్తస్రావానికి గురైన ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందాడు.
తండ్రిపై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అత్తపైనా నిందితుడు దాడి చేసినట్లు సమాచారం. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన జ్యోతిశ్వరన్ స్వయంగా 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఘటన గురించి సమాచారం అందించాడు.
సమాచారం అందుకున్న 108 సిబ్బంది, స్థానికుల ద్వారా పోలీసులు ఘటనపై అప్రమత్తమయ్యారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

