
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు 6,534 అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 3,597 ఎస్జీటీ, 2,937 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 16 నుంచి 21 వరకు సంబంధిత మండల విద్యాశాఖ అధికారి (MEO) కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. ఎంపికైన వారికి ఆగస్టు 30, 31 తేదీల్లో నియామక ఉత్తర్వులు అందజేస్తారు. సెప్టెంబరు 1 నుంచి ఏప్రిల్ 30 వరకు ఎనిమిది నెలల పాటు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
స్కూల్ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10,000 చొప్పున గౌరవ వేతనం చెల్లించనున్నారు.
డిగ్రీ లెక్చరర్ పోస్టుల ఫలితాలు
మరోవైపు డిగ్రీ లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ సైన్స్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 18న ధ్రువపత్రాల పరిశీలనతో పాటు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇంగ్లీష్, మ్యాథ్స్, మైక్రోబయాలజీ లెక్చరర్ పోస్టుల ఎంపిక జాబితాలను కూడా కమిషన్ విడుదల చేసింది.

