
ప్రజాస్వామ్యంలో ఓటు విలువను కాపాడేందుకు ప్రజలు డబ్బులు తీసుకోకుండా ఓటు వేసే చైతన్యం పెంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఇచ్చే డబ్బు అంతా అవినీతి సొమ్మేనని వ్యాఖ్యానించారు.
‘స్త్రీ శక్తికి ఏడాది.. రెట్టింపైన ఆత్మగౌరవం’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. ఓటు విలువపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల్లో రూ.2 వేలు ఇచ్చే నేతలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నుంచి రూ.2 లక్షలు సంపాదించుకుంటారని అన్నారు. తాము ఇచ్చిన డబ్బుకు బదులుగా ప్రజల నుంచి ప్రయోజనం పొందాలనే భావన రాజకీయ నాయకుల్లో ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారికే ఓటు వేయడం సరైన విధానం కాదని చంద్రబాబు అన్నారు. ఓటర్లు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని.. డబ్బులు ఇచ్చే నేతలకు ‘మాకు డబ్బు అవసరం లేదు.. మా ఓటును కొనలేరు’ అని చెప్పే పరిస్థితి రావాలని సూచించారు.
డబ్బులు తీసుకోకుండా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సీఎం కోరారు. ఈ సందర్భంగా అమరావతిలోని పరేడ్ గ్రౌండ్ నుంచి ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయం వరకు మహిళలతో కలిసి ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో ఆయన ప్రయాణించారు.

