
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 50 ఏళ్ల ప్రస్థానంలోకి అడుగుపెట్టిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు పూర్వ విద్యార్థులు, దాతలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు.
స్వర్ణోత్సవాల కోసం రూ.10 లక్షలతో ప్రత్యేక లోగోను రూపొందిస్తున్నారు. వర్సిటీ పూర్వ విద్యార్థి, గ్రానైట్ వ్యాపారి ఈ ఖర్చును భరిస్తుండగా.. ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్ విద్యార్థులు లోగో నిర్మాణాన్ని డిజైన్ చేసి పర్యవేక్షిస్తున్నారు. అలాగే స్వర్ణోత్సవాలు చిరస్థాయిగా గుర్తుండిపోయేలా రూ.12 లక్షలతో ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను రూపొందించేందుకు పూర్వ విద్యార్థుల బృందం బాధ్యత తీసుకుంది.
వేడుకలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో 50 గంటల పాటు నాన్‌స్టాప్ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గిన్నిస్ రికార్డు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే యూనివర్సిటీ ప్రాంగణం నుంచి చారిత్రక అమరావతి స్థూపం వరకు భారీ మారథాన్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
స్వర్ణోత్సవ ప్రధాన కార్యక్రమాన్ని వచ్చే నెల 11న ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీకి సేవలందించిన మాజీ ఉపకులపతులు, అధ్యాపకులు, ప్రముఖులతో పాటు పూర్వ విద్యార్థులు, అప్పటి విద్యార్థి సంఘాల నాయకులుగా ఉండి ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ప్రముఖులను సన్మానించనున్నారు.

