వర్షాకాలం ప్రారంభమైతే జ్వరం, జలుబు, దగ్గు, తీవ్రమైన నీరసం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమయంలో ఫ్లూ, వైరల్ ఇన్‌ఫెక్షన్లు, డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్, లెప్టోస్పిరోసిస్, స్క్రబ్ టైఫస్ వంటి అనారోగ్యాలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండటం దోమల వృద్ధికి అనుకూలంగా మారుతుంది. అలాగే తేమతో కూడిన వాతావరణం కొన్ని శ్వాసకోశ వైరస్‌ల వ్యాప్తికి కూడా దోహదపడుతుంది.
అయితే వర్షాకాలంలో జ్వరం వచ్చిందని వెంటనే యాంటీబయాటిక్స్ తీసుకోవడం సరైన పద్ధతి కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జ్వరానికి కారణం వైరల్ ఇన్‌ఫెక్షనా, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షనా అనేది తెలుసుకున్న తర్వాతే వైద్యుల సూచన మేరకు మందులు వాడటం మంచిది. అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలతో పాటు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది.

జ్వరం అనేది స్వతంత్రంగా ఒక వ్యాధి కాదు.. శరీరంలో ఇన్‌ఫెక్షన్ లేదా ఇతర ఆరోగ్య సమస్య ఉన్నట్లు సూచించే లక్షణం మాత్రమే. అందుకే జ్వరం వచ్చిందని వెంటనే యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ నిపుణురాలు డాక్టర్ జె. కీర్తన తెలిపిన వివరాల ప్రకారం.. వర్షాకాలంలో వచ్చే జ్వరానికి ఇన్‌ఫ్లుయెంజా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, లెప్టోస్పిరోసిస్, స్క్రబ్ టైఫస్ వంటి అనేక కారణాలు ఉండొచ్చు. వీటి ప్రారంభ లక్షణాలు ఒకేలా కనిపించినప్పటికీ, ఒక్కో వ్యాధికి ఒక్కో రకమైన చికిత్స అవసరం. కాబట్టి కారణం తెలియకుండానే యాంటీబయాటిక్స్ వాడటం సరైన పద్ధతి కాదు.
త్వరగా కోలుకోవాలనే ఆందోళనతో చాలామంది జ్వరానికి బలమైన మందులు తీసుకుంటే వెంటనే తగ్గిపోతుందని భావిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే యాంటీబయాటిక్స్ లభించడం, గతంలో మిగిలిపోయిన మందులను తిరిగి వాడటం కూడా ఈ అలవాటుకు కారణమవుతోంది. అంతేకాదు.. జ్వరాన్నే ఒక వ్యాధిగా భావించి, దానికి ఒకే రకమైన మందు పనిచేస్తుందని అనుకోవడం కూడా యాంటీబయాటిక్స్ దుర్వినియోగానికి దారితీస్తోంది.
అందువల్ల జ్వరం వచ్చినప్పుడు కారణాన్ని గుర్తించడం ముఖ్యం. వైద్యుల సూచన లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోకుండా, అవసరమైన పరీక్షలు చేయించుకుని సరైన చికిత్స పొందడం మంచిది.
వైరల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ పనిచేస్తాయా?
యాంటీబయాటిక్స్ ప్రధానంగా బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లను నియంత్రించేందుకు ఉపయోగించే మందులు. వైరస్‌ల వల్ల వచ్చే ఫ్లూ, ఇతర వైరల్ జ్వరాలపై ఇవి ప్రభావం చూపవు. డెంగ్యూ వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లలోనూ సాధారణంగా యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు.
అయితే వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో పాటు బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ కూడా ఉన్నట్లు వైద్యులు నిర్ధారిస్తే, వారి సూచన మేరకు యాంటీబయాటిక్స్ వాడాల్సి రావచ్చు. ఇక మలేరియాకు యాంటీబయాటిక్స్ కాకుండా యాంటీమలేరియల్ మందులు అవసరం.
బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా ఏ బ్యాక్టీరియా కారణమైంది, ఇన్‌ఫెక్షన్ తీవ్రత ఎంత ఉంది, రోగి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వైద్యుడు సరైన యాంటీబయాటిక్‌ను నిర్ణయిస్తారు. ప్రతి ఇన్‌ఫెక్షన్‌కు ఒకే రకమైన యాంటీబయాటిక్ పనిచేయదు.
డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల వికారం, విరేచనాలు, కడుపునొప్పి, అలర్జీ వంటి దుష్ప్రభావాలు కలగవచ్చు. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల జ్వరం వచ్చిందని స్వయంగా యాంటీబయాటిక్స్ వాడకుండా, కారణాన్ని గుర్తించి వైద్యుల సలహా మేరకు మాత్రమే మందులు తీసుకోవడం మంచిది.
అన్నింటికంటే ముఖ్యంగా, యాంటీబయాటిక్స్‌ను అవసరం లేకుండా లేదా వైద్యుల సూచన లేకుండా వాడటం వల్ల యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) పెరిగే ప్రమాదం ఉంది. అంటే బ్యాక్టీరియాలు మందులకు స్పందించకుండా మారిపోతాయి. దీంతో భవిష్యత్తులో నిజంగా బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ వచ్చినప్పుడు చికిత్స చేయడం మరింత కష్టమవుతుంది. యాంటీబయాటిక్స్‌ను అధికంగా, అనుచితంగా ఉపయోగించడం AMRకు ప్రధాన కారణాల్లో ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా హెచ్చరిస్తోంది.
కాబట్టి జ్వరం వచ్చిన వెంటనే సొంతంగా యాంటీబయాటిక్స్ తీసుకోకూడదు. ముందుగా తగినంత విశ్రాంతి తీసుకుంటూ, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు నీరు, ఇతర ద్రవాలు పుష్కలంగా తీసుకోవాలి. జ్వరం తగ్గించేందుకు అవసరమైన మందులను కూడా వైద్యుల సూచన మేరకే ఉపయోగించడం మంచిది.

