
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్ భద్రత, అగ్నిమాపక సేవలు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ (CISF) బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
సీఐఎస్ఎఫ్ సౌత్ సెక్టార్, చెన్నై హెడ్‌క్వార్టర్స్ నుంచి ఈ మేరకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. 2026 నవంబర్ 17 నుంచి సెక్యూరిటీ, ఫైర్ వింగ్‌లలోని సీఐఎస్ఎఫ్ సిబ్బందిని ఉపసంహరించే ప్రక్రియ ప్రారంభించాలని, ఇందుకోసం మూడు నెలల నోటీసు ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం.
ఈ మేరకు జారీ అయినట్లు చెబుతున్న ఉత్తర్వుల కాపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, దీనిపై విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నుంచి అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.
2024 వరకు స్టీల్ ప్లాంట్‌లో సుమారు 1,500 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది విధులు నిర్వహించగా, ఆ తర్వాత దశలవారీగా బలగాలను తగ్గించారు. ప్రస్తుతం సెక్యూరిటీ, ఫైర్ విభాగాల్లో 1,033 మంది, 298 మంది ఉన్నట్లు సమాచారం.
సీఐఎస్ఎఫ్ ఉపసంహరణ అనంతరం భద్రత, ఫైర్ సేఫ్టీ బాధ్యతలను ఎవరు చేపడతారన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. గతంలో ఉపసంహరించిన సిబ్బంది స్థానంలో ఏపీ స్పెషల్ ఫోర్స్‌ను నియమించిన నేపథ్యంలో, ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే, సీఐఎస్ఎఫ్ ఉపసంహరణపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

