
హైదరాబాద్, ఆగస్టు 24: 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికలతో పాటు ఎన్డీయే పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అంశంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ప్రస్తుతం 17 రాష్ట్రాల్లో బీజేపీ, మరో ఐదు రాష్ట్రాల్లో మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. 2029లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
అయితే 2028లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లో అసెంబ్లీల పదవీకాలం ముగియనుంది. జమిలి ఎన్నికల కోసం వీటి పదవీకాలాన్ని కొన్ని నెలల నుంచి ఏడాది వరకు పొడిగించాల్సి రావచ్చు. అలాగే 2030-31లో ఎన్నికలు జరగాల్సిన బిహార్, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అస్సాం తదితర రాష్ట్రాల్లో పదవీకాలాన్ని ముందుకు జరపాల్సి రావచ్చు.
జమిలి ఎన్నికల అమలుకు పార్లమెంట్‌లో చట్టపరమైన మార్పులతో పాటు విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం అవసరం. విపక్ష పాలిత రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించే అవకాశం ఉన్న నేపథ్యంలో.. తొలుత ఎన్డీయే పాలిత 22 రాష్ట్రాల్లోనే ఏకకాల ఎన్నికల నిర్వహణపై కేంద్రం దృష్టి సారించినట్లు సమాచారం.
2029 నాటికి జమిలి ఎన్నికలు సాధ్యమేనన్న సంకేతాలు ఇప్పటికే వెలువడ్డ నేపథ్యంలో ఈ అంశంపై ఎన్డీయేలో చర్చలు వేగం పుంజుకున్నాయి.

