
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రవాణాను మరింత ఆధునికీకరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. డిసెంబర్ నాటికి మొత్తం 1,050 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయని ఆర్టీసీ ఛైర్మన్ కొనకొండ్ల నారాయణరావు తెలిపారు.
అక్టోబర్ చివరి నాటికి 350 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. భవిష్యత్‌లో రాష్ట్రంలోని ప్రతి ఆర్టీసీ డిపోలోనూ ఎలక్ట్రిక్ బస్సు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని చెప్పారు. ఇందుకోసం అన్ని డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
అనంతపురం ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన నారాయణరావు.. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవడం లేదన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల రాకతో ఈ సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో మొత్తంగా దశలవారీగా 5,500 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఈ-బస్ సేవా పథకం కింద ఏపీకి 750 బస్సులు కేటాయించగా, వాటిలో 300 బస్సులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
తొలిదశలో విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, అమరావతి, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప, అనంతపురం వంటి ప్రధాన నగరాలకు ఎలక్ట్రిక్ బస్సులను కేటాయిస్తున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల భారం తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రిక్ బస్సులు దోహదపడనున్నాయి. దశలవారీగా ఈ సేవలను విస్తరించి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి డిపోకు ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
