
రాయలసీమ అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విజన్‌తో ముందుకు సాగుతున్నారని డిప్యూటీ సీఎంవో తెలిపింది. గత రెండేళ్లలో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, అటవీ, పర్యావరణ రంగాలకు సంబంధించి రూ.8,022 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించింది.
గ్రామీణ మౌలిక వసతుల కోసం రూ.4,523 కోట్లతో 23 వేలకు పైగా రోడ్ల పనులు చేపట్టారు. ఇప్పటికే 5,238 కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తవడంతో గ్రామీణ ప్రాంతాల అనుసంధానం మరింత బలోపేతమవుతోంది.
ఉపాధి హామీ ద్వారా 62 వేల ఎకరాల్లో ఉద్యాన సాగుకు రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేశారు. దీనివల్ల 28 వేల మంది రైతులకు ఎకరాకు ఏటా రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం లభించే అవకాశం ఏర్పడిందని డిప్యూటీ సీఎంవో తెలిపింది. అలాగే 41,614 ఫారం పాండ్లు, 15 వేల మినీ గోకులాలు, 3 వేల గోకులాలు నిర్మించారు.
తాగునీటి సౌకర్యం కోసం రూ.2,782 కోట్లతో జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార కింద పులివెందుల, డోన్, చిత్తూరు మెగా వాటర్ స్కీమ్‌ల పనులు కొనసాగుతున్నాయి. చిత్తూరులో రూ.2,370 కోట్ల మెగా వాటర్‌గ్రిడ్ ద్వారా వచ్చే 30 ఏళ్లలో 25 లక్షల మందికి పైగా ప్రజలకు తాగునీరు అందించనున్నారు.
అటవీ, పర్యావరణ రంగంలో 13 నగర వనాలను రూ.26 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ముసలమడుగులో కుంకీ ఏనుగుల సంరక్షణ కేంద్రం, ఎకో టూరిజం, వుడ్ బ్యాంకుల వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. కుంకీ ఏనుగుల వినియోగంతో పంట నష్టాన్ని తగ్గించే చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
రోడ్ల పనులకు జిల్లాల వారీగా కడపకు రూ.876 కోట్లు, అనంతపురానికి రూ.691 కోట్లు, తిరుపతికి రూ.521 కోట్లు, అన్నమయ్యకు రూ.518 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లాకు రూ.483 కోట్లు కేటాయించారు.
సాగు, తాగునీరు, రహదారులు, గ్రామీణ మౌలిక వసతులు, అటవీ అభివృద్ధిపై దృష్టి సారిస్తూ రాయలసీమ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని డిప్యూటీ సీఎంవో పేర్కొంది.
