
శ్రీ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లి హెడ్ రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు, అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి వెలిగొండ ప్రాజెక్టులోకి కృష్ణా జలాలను విడుదల చేశారు.
వెలిగొండ ప్రాజెక్టు కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదని, కరువు సీమ భవిష్యత్‌ను మార్చే చారిత్రక ప్రాజెక్టు అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతిలో సోమవారం మాట్లాడిన ఆయన.. మూడు దశాబ్దాల వెలిగొండ కలను చంద్రబాబు సాకారం చేశారని పేర్కొన్నారు. 1996లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు చేతుల మీదుగానే ఇప్పుడు జాతికి అంకితం చేయడం చారిత్రాత్మక ఘట్టమన్నారు.
వెలిగొండ ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో లక్షలాది మందికి తాగునీటి భరోసా లభించనుందని తెలిపారు. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల రైతులకు ఈ ప్రాజెక్టు వరప్రదాయినిగా మారుతుందని అన్నారు.
కృష్ణా వరద జలాలను కరువు ప్రాంతాలకు మళ్లించడం ద్వారా రైతుల పొలాలకు జీవం పోస్తున్నామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వెలిగొండతో మార్కాపురం జిల్లాలో చెరువులు నిండడంతో పాటు భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి కొత్త ఊపిరి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన 11 గ్రామాల నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు. కేవలం 48 రోజుల్లో రూ.762 కోట్ల పరిహారం అందించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
సాగునీరు, తాగునీరు, ఉపాధి, ప్రాంతీయ అభివృద్ధికి వెలిగొండ ప్రాజెక్టు కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆయన అన్నారు.
