
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి మరో విలువైన కానుక అందింది. దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) రూ.11 లక్షల విలువైన బంగారు జడను అమ్మవారికి సమర్పించారు.
బొర్రా రాధాకృష్ణ కుటుంబ సభ్యులు బంగారు జడను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో శీనానాయక్, అర్చకులకు అందజేశారు. అమ్మవారి అలంకరణలో ఈ బంగారు జడను ఉపయోగించాలని ఆయన కోరారు.
బంగారు జడలో లక్ష్మీదేవి, ఇతర దైవిక రూపాలతో పాటు ఆకుపచ్చ రంగు విలువైన రాళ్లు, ముత్యాలు పొదిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కానుక సమర్పించిన సందర్భంగా ఆలయ అధికారులు బొర్రా రాధాకృష్ణను సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు, అమ్మవారి ప్రసాదం అందించారు.
20 ఏళ్ల క్రితం చేసిన సంకల్పం నెరవేర్పు
దాదాపు 20 ఏళ్ల క్రితం దుర్గమ్మ ఆలయాన్ని దర్శించిన సమయంలో అమ్మవారికి బంగారు జడ సమర్పించాలని సంకల్పించానని బొర్రా రాధాకృష్ణ తెలిపారు. పాలక మండలి ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కుటుంబ సభ్యులు, మిత్రుల సహకారంతో ఆ సంకల్పాన్ని నెరవేర్చుకున్నానని ఆనందం వ్యక్తం చేశారు.
తన పదవీకాలంలో ఆలయ అభివృద్ధి, అన్నదానం, ఉచిత ప్రసాదం, బంగారం, వెండి ఆభరణాలు, గోసంరక్షణ వంటి కార్యక్రమాలకు మిత్రుల సహకారంతో రూ.1.16 కోట్ల విరాళాలు అందినట్లు తెలిపారు.
ఇదే క్రమంలో తన మిత్రుడు ఒకరు త్వరలోనే రూ.75 లక్షల విలువైన వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని అమ్మవారికి సమర్పించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శీనానాయక్, స్థానాచార్య శివప్రసాదశర్మ, ప్రధానార్చకులు, వైదిక కమిటీ సభ్యులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
