
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లి హెడ్ రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన అనంతరం సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.
1996లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు.. 30 ఏళ్ల తర్వాత 2026లో అదే ప్రాజెక్టును ముఖ్యమంత్రిగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మూడు దశాబ్దాల కల సాకారం కావడంతో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం ఫీడర్ కెనాల్ గేట్లను ఎత్తి నల్లమల సాగర్ రిజర్వాయర్‌లోకి కృష్ణా జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా గేట్లు ఎత్తే బటన్‌ను స్థానిక రైతులతోనే నొక్కించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రైతుల ఆనందాన్ని చూసి చంద్రబాబు కూడా సంతోషం వ్యక్తం చేశారు.
ఫీడర్ కెనాల్ గేట్లు ఎత్తడంతో శ్రీశైలం జలాలు ముంపు గ్రామాల మీదుగా నల్లమల సాగర్ రిజర్వాయర్‌లోకి చేరుకున్నాయి. వెలిగొండ తొలి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందనుంది.
30 ఏళ్ల కల నెరవేరిన సందర్భంగా మార్కాపురం జిల్లా రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
