ఆసియాలో ప్రముఖ వైద్య సంస్థగా పేరున్న ఏఐజీ (AIG) హాస్పిటల్స్‌ సేవలు ఇకపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కూడా అందుబాటులోకి రానున్నాయి. విశాఖపట్నం ఎండాడలో ఏఐజీ మెడికల్‌ క్యాంపస్‌ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏఐజీ హాస్పిటల్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డితో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

1,000 పడకల సామర్థ్యంతో నిర్మించనున్న ఈ ఆస్పత్రి సేవలు దశలవారీగా అందుబాటులోకి రానున్నాయి. తొలి దశలో టవర్‌-A, టవర్‌-Bల్లో 650 పడకలతో 2028 నాటికి సేవలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశలో టవర్‌-C ద్వారా మరో 350 పడకలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఏఐజీ సంస్థ ఐదేళ్లలో విశాఖలో దశలవారీగా రూ.2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 9 ఎకరాల్లో ఆస్పత్రి, మరో 2.5 ఎకరాల్లో నర్సింగ్‌ కాలేజీ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 9 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

విశాఖ ఏఐజీ మెడికల్‌ క్యాంపస్‌లో 50కి పైగా సూపర్‌ స్పెషాలిటీ విభాగాలు, 8 ప్రధాన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లు, మదర్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. నర్సింగ్‌ కాలేజీ, పారామెడికల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, అధునాతన రీసెర్చ్‌ ల్యాబ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ హెల్త్‌కేర్‌ సెంటర్‌ కూడా అందుబాటులోకి రానున్నాయి.

రోగులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సౌకర్యాలతో సమగ్ర హెల్త్‌కేర్‌ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ఏఐజీ ప్రతినిధులు తెలిపారు. నర్సింగ్‌ విద్యార్థులు, సిబ్బందికి వసతిగృహాలతో పాటు రోగుల కోసం అందుబాటు ధరల్లో గదులను ఏర్పాటు చేయనున్నారు.

ఏఐజీ ఆస్పత్రి విశాఖలో అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రజలకు అధునాతన వైద్య సేవలు స్థానికంగానే లభించనున్నాయి. తీవ్రమైన, సూపర్‌ స్పెషాలిటీ చికిత్సల కోసం హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.

ఈ కార్యక్రమంలో స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు, ఏఐజీ హాస్పిటల్స్‌ వైస్‌ ఛైర్మన్‌ పీవీఎస్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *