
పేద, మధ్యతరగతి బీసీ విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలతో పాటు నాణ్యమైన వసతి, భోజన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
మంత్రి ప్రత్యేక చొరవతో టెక్కలి డివిజన్ పరిధిలోని 12 బీసీ వసతి గృహాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 356 మంది విద్యార్థులకు కొత్తగా ప్రవేశాలు కల్పించారు. సోమవారం నిమ్మాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బీసీ వసతి గృహాల సలహా కమిటీ సమావేశం నిర్వహించి ప్రవేశాలపై సమీక్షించారు.
కొత్తగా ప్రవేశాలు పొందిన వారిలో 120 మంది బాలికలు, 236 మంది బాలురు ఉన్నారు. దీంతో గ్రామీణ, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు తమ స్వగ్రామాలకు దూరంగా చదువుకునే సమయంలో ఉచిత వసతి, భోజనం వంటి సౌకర్యాలు పొందడంతో కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుంది.
పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బీసీ విద్యార్థులకు సురక్షితమైన వసతి, నాణ్యమైన విద్య, అవసరమైన మౌలిక సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం, పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి సదుపాయాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలని సూచించారు.
బీసీ విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడం ద్వారా ఉన్నత విద్యతో పాటు భవిష్యత్‌లో మంచి ఉపాధి అవకాశాలకు ప్రభుత్వం బాటలు వేస్తోందని మంత్రి తెలిపారు. విద్యార్థుల సంక్షేమం, ఉజ్వల భవిష్యత్తే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
