
విజయవాడ నుంచి గుడివాడ రైలులో ప్రయాణం అంటే గతంలో ప్రయాణికులకు ఇబ్బందులతో కూడుకున్న వ్యవహారమే. సింగిల్ లైన్ కారణంగా ఎదురుగా మరో రైలు వస్తే ఎక్కడపడితే అక్కడ రైళ్లను నిలిపివేసేవారు. దీంతో తక్కువ దూరం ఉన్నప్పటికీ ప్రయాణం మూడు గంటలకు పైగా పట్టేది. రైలు ఎప్పుడు బయలుదేరుతుందో, ఎప్పుడు గమ్యస్థానానికి చేరుతుందో తెలియని పరిస్థితి ఉండేది.
అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. విజయవాడ–గుడివాడ మార్గంలో సింగిల్ లైన్‌ను డబుల్ లైన్‌గా మార్చడంతో రైళ్ల రాకపోకలు మరింత సాఫీగా సాగుతున్నాయి. దీంతో ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గింది.
గతంలో విజయవాడ నుంచి గుడివాడకు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సుమారు గంటన్నర, ప్యాసింజర్ రైళ్లకు మూడు గంటలకు పైగా సమయం పట్టేది. ప్రస్తుతం ఎంఈఎంయూ రైళ్లు సుమారు గంటలో, ఎక్స్‌ప్రెస్ రైళ్లు 45 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటున్నాయి.
సరుకు రవాణాపైనా ఫోకస్
డబుల్ లైన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో ఈ మార్గంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో అదనపు కోచింగ్ టెర్మినళ్లను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. సరుకు రవాణా కోసం అదనపు రైళ్లను నడిపి ఆదాయాన్ని పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.
గుడివాడ, మచిలీపట్నం, నరసాపురం, భీమవరం, నిడదవోలు వంటి ప్రధాన రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయనున్నారు. డబుల్ లైన్ అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు సమయం ఆదా కావడంతో పాటు రైళ్ల రాకపోకలు కూడా వేగవంతం కానున్నాయి.
