
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే మంచి ప్రణాళికతో పాటు సరైన శిక్షణ కూడా అవసరం. అయితే ఖరీదైన కోచింగ్ సెంటర్లలో చదివే స్థోమత లేని పేద, మధ్యతరగతి అభ్యర్థులకు నెల్లూరులోని బీసీ స్టడీ సర్కిల్ అండగా నిలుస్తోంది. నిపుణులతో శిక్షణ, స్టడీ మెటీరియల్ అందిస్తూ పోటీ పరీక్షలకు అభ్యర్థులను సిద్ధం చేస్తోంది.
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2013లో నెల్లూరులో ఈ స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేశారు. గ్రూప్-2, డీఎస్సీ, పోలీస్, రైల్వే, ఫారెస్ట్, బ్యాంకింగ్ తదితర ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదలైనప్పుడు ఒక్కో బ్యాచ్‌లో సుమారు 100 మందికి శిక్షణ అందిస్తున్నారు.
ప్రస్తుతం గ్రూప్-2 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. 75 మంది దరఖాస్తు చేసుకోగా 45 మంది తరగతులకు హాజరవుతున్నారు. సబ్జెక్టుల వారీగా ఐదుగురు ట్యూటర్లు బోధిస్తున్నారు. స్టడీ మెటీరియల్‌తో పాటు అభ్యర్థులకు స్టైఫండ్ కూడా అందిస్తున్నారు. ఈ శిక్షణ రెండు నెలల పాటు కొనసాగనుంది.
ఇప్పటి వరకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా సుమారు 900 మందికి శిక్షణ అందించగా.. 110 మంది వివిధ పోటీ పరీక్షల్లో అర్హత సాధించారు. ఇక్కడ అందుతున్న శిక్షణతో పరీక్షల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి మెళకువలు పాటించాలనే అంశాలపై అవగాహన వస్తోందని అభ్యర్థులు చెబుతున్నారు.
పేద, మధ్యతరగతి విద్యార్థులపై కోచింగ్ ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
