ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ సరికొత్త విధానాన్ని తీసుకొస్తోంది. టికెట్‌ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులను వారి ఇంటి దగ్గరే పికప్ చేసుకునే సౌకర్యాన్ని తొలుత విజయవాడ పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది.

మొదటి దశలో విజయవాడ–హైదరాబాద్‌ రూట్‌లో నడిచే బస్సులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. కనీసం ఆరుగురు ప్రయాణికులు కలిసి ఆన్‌లైన్ లేదా ఆర్టీసీ కౌంటర్లలో టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు ఈ సర్వీస్‌ను వినియోగించుకోవచ్చు.

ఇంటి దగ్గర బస్సు ఎక్కాలనుకునే ప్రయాణికులు.. తమ పికప్ పాయింట్‌ నుంచి బస్టాండ్‌కు ఉన్న దూరానికి అనుగుణంగా అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ సౌకర్యం కోసం బస్సు బయలుదేరే సమయానికి కనీసం నాలుగు గంటల ముందు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య 73828 25450, 99592 25450 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేసే యోచనలో ఆర్టీసీ ఉంది. ఇంటి దగ్గరే పికప్ సదుపాయం కల్పించడం ద్వారా బస్సుల్లో ఆక్యుపెన్సీ కూడా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

హైకోర్టు బస్సు రూట్‌లో మార్పులు

మరోవైపు విజయవాడ పీఎన్‌బీఎస్‌ నుంచి ఏపీ హైకోర్టుకు వెళ్లే బస్సు సర్వీసు రూట్‌లో మార్పులు చేశారు. ప్రతిరోజూ ఉదయం 9.10 గంటలకు బయలుదేరే బస్సు సీడ్ యాక్సిస్ రోడ్, సీఆర్‌డీఏ మీదుగా హైకోర్టుకు చేరుకునేలా మార్పు చేశారు.

అలాగే ఆగస్టు 31 నుంచి ఉదయం 9.25 గంటలకు ఉండవల్లి సెంటర్‌ నుంచి పెనుమాక, మందడం మీదుగా హైకోర్టుకు మరో ట్రిప్‌ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *