ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పదో తరగతి మార్కుల మెమోలపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించే విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఇకపై టెన్త్ పాసైన విద్యార్థులకు జారీ చేసే మార్కుల మెమోలపై ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది.

మొబైల్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆర్టీజీఎస్ వెబ్‌సైట్‌కు కనెక్ట్ అవుతుంది. అక్కడ విద్యార్థి వివరాలు, మార్కులను వెంటనే చూడొచ్చు. దీంతో ఒరిజినల్, నకిలీ సర్టిఫికెట్లను సులభంగా గుర్తించడంతో పాటు ఉద్యోగాలు, ఉన్నత విద్య ప్రవేశాల సమయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది.

హాల్‌టికెట్లపైనా QR కోడ్

2025-26 విద్యా సంవత్సరంలోనే ఏపీ విద్యాశాఖ టెన్త్ హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. మార్చిలో జరిగిన పరీక్షలకు హాజరైన విద్యార్థుల హాల్‌టికెట్లపై ఈ కోడ్‌ను ముద్రించారు.

క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే పరీక్షా కేంద్రం ఎక్కడ ఉంది, అక్కడికి ఎలా వెళ్లాలి, ఎంత సమయం పడుతుంది వంటి వివరాలు తెలుసుకునే అవకాశం కల్పించారు. హాల్‌టికెట్లపైనే పరీక్షల టైమ్‌టేబుల్‌ను కూడా ముద్రించారు.

ఇక పదో తరగతి విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్టీసీ హాల్‌టికెట్ చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. మరోవైపు విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచే లక్ష్యంతో విద్యాశాఖ 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తోంది. డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో విద్యార్థులకు సౌలభ్యం కల్పించడంతో పాటు సర్టిఫికెట్ల ధ్రువీకరణలో పారదర్శకత పెంచడమే ఈ సంస్కరణల లక్ష్యం.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *