హైదరాబాద్‌–విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి 65 విస్తరణ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీపీపీఏసీ ఆమోదం తెలిపింది. తదుపరి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) అనుమతి కోసం ప్రతిపాదనను పంపించారు. సీసీఈఏ ఆమోదం లభించిన వెంటనే భూసేకరణ, టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

ప్రస్తుతం నాలుగు లైన్లుగా ఉన్న NH-65ను ఆరు లైన్లుగా విస్తరించనున్నారు. మొత్తం 284 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.12 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా.

మూడు ప్యాకేజీలుగా పనులు

హైదరాబాద్‌ శివారు మల్కాపూర్‌ నుంచి విజయవాడ బైపాస్‌లోని గొల్లపూడి వరకు 226 కిలోమీటర్ల రహదారిని మూడు ప్యాకేజీలుగా ఆరు లైన్లుగా విస్తరించనున్నారు. హైదరాబాద్‌–నందిగామ, నందిగామ–గొల్లపూడి మార్గాల్లో రెండు ప్యాకేజీల కింద బీఓటీ విధానంలో పనులు చేపట్టనున్నారు.

విజయవాడ–మచిలీపట్నం మధ్య 58 కిలోమీటర్ల రహదారిని మూడో ప్యాకేజీ కింద అభివృద్ధి చేయనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నుంచి మచిలీపట్నం వరకు 44 కిలోమీటర్ల మేర హ్యామ్ విధానంలో ఆరు లైన్ల రహదారిని నిర్మించనున్నారు. హైవేలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మొత్తం 14 కిలోమీటర్ల మేర సర్వీస్ రోడ్లను కూడా ఏర్పాటు చేయనున్నారు.

కొన్ని ప్రతిపాదనలకు నో

విజయవాడ భవానీపురం నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్ వరకు సుమారు 5 కిలోమీటర్ల విస్తరణ ప్రతిపాదనకు పీపీపీఏసీ ఆమోదం లభించలేదు. అలాగే బెంజ్ సర్కిల్‌ నుంచి ఈడుపుగల్లు కూడలి వరకు ప్రతిపాదించిన ఆరు లైన్ల ఫ్లైఓవర్‌కు కూడా అనుమతి రాలేదు.

మొత్తంగా హైదరాబాద్‌–విజయవాడ మధ్య 226 కిలోమీటర్లు, విజయవాడ–మచిలీపట్నం మధ్య 58 కిలోమీటర్లు కలిపి 284 కిలోమీటర్ల విస్తరణకు పీపీపీఏసీ ఆమోదం తెలిపింది. సీసీఈఏ అనుమతి వచ్చిన వెంటనే భూసేకరణతో పాటు ప్యాకేజీల వారీగా టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *