నరసరావుపేట: కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తోందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు అన్నారు. మంగళవారం పట్టణంలోని 11, 22, 23, 28వ వార్డుల్లో నిర్వహించిన ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లాతో కలిసి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నెలా ఒకటో తేదీన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 62 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెలా దాదాపు రూ.3 వేల కోట్ల పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. సంక్షేమంతో పాటు అమరావతి రాజధాని, పోలవరం, నదుల అనుసంధానం వంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

సెప్టెంబర్‌ 2న నారా లోకేష్‌ పర్యటన

మంత్రి నారా లోకేష్‌ సెప్టెంబర్‌ 2న నరసరావుపేటలో పర్యటించనున్న నేపథ్యంలో ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఎస్‌ఆర్‌కేటీ కాలనీ నుంచి ప్రారంభమయ్యే పర్యటన చిలకలూరిపేట రోడ్డు వంతెన, మమ్మా సెంటర్‌, వినుకొండ వంతెన మీదుగా జేఎన్‌టీయూకే కళాశాలకు చేరుకోనుంది. అక్కడ నూతన వసతి భవనాల ప్రారంభంతో పాటు కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

జిల్లాలో 2.26 లక్షల మందికి పింఛన్లు

జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా మాట్లాడుతూ నరసరావుపేట 28వ వార్డులో ఎమ్మెల్యేతో కలిసి జిల్లా స్థాయి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఉదయం 10.30 గంటలకే జిల్లావ్యాప్తంగా 80 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయిందని, సాయంత్రానికి 100 శాతం పూర్తి చేస్తామని చెప్పారు.

జిల్లాలో సుమారు 2.26 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెలా రూ.116 కోట్ల మేర పింఛన్లు అందిస్తున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఇంటింటికీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *