
వెబ్ డెస్క్: సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు షాకిచ్చాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాంటీన్లు వంటి వాణిజ్య సంస్థలపై అదనపు భారం పడనుంది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తాజా ధరల ప్రకారం.. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.9.50 పెరిగి రూ.2,747.50కి చేరింది. ముంబైలోనూ రూ.9.50 పెరగడంతో రూ.2,701కి చేరింది. హైదరాబాద్లో రూ.11 పెరగడంతో 19 కిలోల సిలిండర్ ధర రూ.2,985 నుంచి రూ.2,996కి పెరిగింది. చెన్నైలో రూ.10.50 పెరిగి రూ.2,916.50కి చేరింది.
ఆగస్టులో కమర్షియల్ సిలిండర్ ధరలను స్వల్పంగా తగ్గించిన చమురు సంస్థలు.. సెప్టెంబర్ ప్రారంభంలోనే మళ్లీ పెంచాయి. తాజా పెంపుతో వాణిజ్య సంస్థల ఇంధన ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది.
అయితే గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్ ధర రూ.994గా కొనసాగుతోంది.
