మంగళగిరి: రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు 18 వేల ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించాలని గనుల శాఖ అధికారులను మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మయూరి టెక్ పార్కులో ఏర్పాటు చేసిన మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టరేట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

కొత్తగా ఏర్పాటు చేసిన కెమికల్ ల్యాబ్‌, కాన్ఫరెన్స్ హాల్‌, కమాండ్ కంట్రోల్ రూమ్‌, రికార్డు రూమ్‌, మైన్స్ ఎగ్జిబిషన్‌ను మంత్రి పరిశీలించారు. అనంతరం అన్ని జిల్లాల నుంచి వచ్చిన మైనింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి శాఖ పనితీరుపై సమీక్షించారు.

రాష్ట్రంలో మైనింగ్ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. ఏపీ రేర్ ఎర్త్ పాలసీ ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సుమారు 65 వేల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

ఫ్రీ శాండ్ పాలసీ ద్వారా ఇప్పటివరకు 2.1 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక నిల్వలు పూర్తిస్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 2024–25తో పోలిస్తే 2025–26 ఆర్థిక సంవత్సరంలో గనుల శాఖ ఆదాయం 32 శాతం పెరిగిందన్నారు. కొత్త మైనింగ్ లీజుల వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

ఇసుక, మైనింగ్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజలకు ప్రయోజనం కలిగేలా శాఖలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు.

నాలుగు కొత్త కన్వెన్షన్‌ సెంటర్లకు అనుమతి

మరోవైపు రాష్ట్రంలో మరో నాలుగు కన్వెన్షన్‌ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తిరుపతి, అనంతపురం, రాజమహేంద్రవరం, అమరావతి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. సాస్కీ నిధులు రూ.68.02 కోట్లతో ఈ ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు.

ప్రజలు, వ్యాపారులు, పర్యాటకులు, సాంస్కృతిక కార్యక్రమాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కన్వెన్షన్‌ సెంటర్లను నిర్మించనున్నారు. నాలుగు ప్రాంతాల్లో కన్వెన్షన్‌ సెంటర్ల ఏర్పాటుకు ఏపీఐఐసీ ప్రతిపాదనలు సమర్పించింది.

నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం వీటి నిర్వహణ, ఆపరేషన్‌ను పీపీపీ విధానంలో అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *