అమరావతి: ఏపీలో ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్‌ నుంచి దశలవారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. పింఛన్ల కోసం వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించి, అర్హులకు త్వరగా పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కేబినెట్‌ భేటీకి ముందు సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులతో సమావేశమైన లోకేష్‌.. కొత్త పింఛన్లతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. అక్టోబర్‌ నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని, ఎన్నికలు వాయిదా పడే అవకాశం లేదని స్పష్టం చేశారు.

ముందుగా మున్సిపల్‌ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. కూటమి అభ్యర్థుల విజయానికి టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్‌ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

విద్యాశాఖను లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ జరుగుతోందని, మంత్రులు అప్రమత్తంగా ఉండాలని లోకేష్‌ సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికలతో నీటి పొదుపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *