కడప: రాయలసీమలో మరో కొత్త రైల్వే లైన్‌ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. కడప జిల్లా ముద్దనూరు నుంచి శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి వరకు 105.31 కిలోమీటర్ల రైల్వే లైన్‌ నిర్మాణానికి రూ.2,505 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు రైల్వే బోర్డు నుంచి కూడా క్లియరెన్స్‌ లభించినట్లు తెలుస్తోంది.

ముద్దనూరు నుంచి పులివెందుల, ముదిగుబ్బ మీదుగా పుట్టపర్తి ప్రశాంతి నిలయం వరకు ఈ రైల్వే లైన్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు. కొత్త మార్గంలో చిన్నదుద్యాల, మల్లెల, మడూరు, పులివెందుల, అంబకపల్లి, దొరిగల్లు, గునిపల్లి, బుచ్చయ్యగారిపల్లె వద్ద మొత్తం ఎనిమిది స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

ఈ రైల్వే లైన్‌ పూర్తయితే పుట్టపర్తి మీదుగా బెంగళూరుతో రైలు కనెక్టివిటీ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ముద్దనూరు వద్ద రేణిగుంట–కడప–గుంతకల్లు మార్గానికి ఈ లైన్‌ అనుసంధానమవుతుంది. పుట్టపర్తి సమీపంలో ధర్మవరం–పుట్టపర్తి–పెనుకొండ మార్గంలో కలవడం ద్వారా బెంగళూరు వైపు రైలు ప్రయాణానికి మార్గం ఏర్పడుతుంది.

నిలిచిపోయిన కడప–బెంగళూరు రైల్వే ప్రాజెక్టు

గతంలో కడప నుంచి బెంగళూరుకు కొత్త రైల్వే లైన్‌ నిర్మించాలని ప్రతిపాదించినప్పటికీ భూసేకరణ, భారీ నిర్మాణ వ్యయం వంటి కారణాలతో ప్రాజెక్టు ముందుకు సాగలేదు. మొత్తం 268 కిలోమీటర్ల ఈ మార్గంలో 207 కిలోమీటర్లు ఏపీ పరిధిలో ఉంది.

కడప నుంచి పెండ్లిమర్రి వరకు రైల్వే లైన్‌ నిర్మాణం పూర్తయినా.. ఆ తర్వాత పనులు నిలిచిపోయాయి. భూసేకరణతో పాటు ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రం సుమారు 50 శాతం భరించాల్సి ఉండటంతో సమస్యలు తలెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసి తన వాటా నిధులు సమకూరిస్తే పెండ్లిమర్రి నుంచి పనులు కొనసాగిస్తామని రైల్వేశాఖ చెబుతోంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *