
అమరావతి, సెప్టెంబర్ 4: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అధర్మాన్ని అడ్డుకుని ధర్మాన్ని పరిరక్షించేందుకు శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారమే శ్రీకృష్ణావతారం అని పేర్కొన్నారు.
కురుక్షేత్ర మహా సంగ్రామంలో అర్జునుడికి కర్తవ్యబోధ చేసి, ప్రపంచ మానవాళికి మార్గదర్శకంగా నిలిచే భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడని చంద్రబాబు కొనియాడారు. భగవద్గీతలోని బోధనలు నేటికీ ప్రతి వ్యక్తి జీవితానికి, సమాజానికి విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయని అన్నారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రతి ఇంటా ఆనందం, శాంతి, సంతోషం వెల్లివిరియాలని సీఎం ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంపై శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భక్తిశ్రద్ధలతో జన్మాష్టమి వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.
ధర్మ సంస్థాపనకు శ్రీకృష్ణుడి జీవితం స్ఫూర్తి: నారా లోకేశ్
మంత్రి నారా లోకేశ్ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ధర్మ సంస్థాపన, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించిన పర్వదినమే జన్మాష్టమి అని పేర్కొన్నారు.
శ్రీకృష్ణుడి జీవితం మానవాళికి ధర్మం, కర్తవ్యం, సత్యం, న్యాయం, భక్తి, జ్ఞానం వంటి విలువలను బోధించిందన్నారు. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి శ్రీకృష్ణుడు అందించిన భగవద్గీత సందేశం యుగయుగాలుగా మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తోందని లోకేశ్ అన్నారు.
