నెల్లూరు: నెల్లూరులో సర్వేపల్లి కాలువకట్ట వాసుల 60 ఏళ్ల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. కాలువకట్టపై నివాసం ఉంటున్న అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసేందుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో సుమారు 1,215 కుటుంబాలకు శాశ్వత నివాస హక్కు కల్పించేందుకు మార్గం సుగమమైంది.

మొత్తం 62.70 ఎకరాల పరిధిలో 22.31 ఎకరాల భూమికి సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నారు. సర్వేపల్లి కాలువ నిర్వహణ హక్కులకు పూర్తి రక్షణ ఉండేలా భూమి స్వరూపాన్ని కెనాల్‌ పోరంబోకు నుంచి ఏడబ్ల్యూ డ్రైగా మార్చి, అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దశాబ్దాలుగా పట్టాల కోసం ఎదురుచూస్తున్న కాలువకట్ట వాసులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల పట్టాలు లేకపోవడంతో ఎన్నో ఏళ్లుగా అనిశ్చితి, భయంతో జీవిస్తున్న తమకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనిస్తుందని తెలిపారు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. సర్వేపల్లి కాలువకట్ట వాసుల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం కోసం కృషి చేశారు. తాజాగా కేబినెట్‌ ఆమోదంతో పట్టాల పంపిణీకి మార్గం ఏర్పడింది.

త్వరలో నెల్లూరులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 1,215 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. 60 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం చూపడం ఆనందంగా ఉందని, పేదల శాశ్వత నివాస హక్కు కల నెరవేరనుందని పేర్కొన్నారు.

కేబినెట్‌ నిర్ణయంపై సర్వేపల్లి కాలువకట్ట వాసులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *