
రాజమహేంద్రవరం: ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్ నుంచి భారీగా కాలుష్యం విడుదల అవుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను మాత్రం చెల్లించకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరం నగరంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ద్రవ వ్యర్థాల్లో దాదాపు సగం ఆంధ్రా పేపర్స్ నుంచే వస్తున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నగరం మొత్తం రోజుకు సుమారు 70 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి చేస్తుంటే, ఒక్క ఆంధ్రా పేపర్స్ నుంచే సుమారు 35 మిలియన్ లీటర్ల వ్యర్థాలు వస్తున్నాయని తెలిపారు.
ఆంధ్రా పేపర్స్ విడుదల చేస్తున్న వ్యర్థాల్లో అనుమతించిన పరిమితికి మించి కాలుష్య కారకాలు ఉన్నట్లు నిర్ధారణ అయిందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో పన్నుల బకాయిలపైనా ఆయన తీవ్రంగా స్పందించారు. 2016 తర్వాత కాతేరు గ్రామపంచాయతీకి, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించలేదని తెలిపారు. ప్రస్తుతం సుమారు రూ.21.34 కోట్ల పన్నులు బకాయి ఉన్నాయని పేర్కొన్నారు.
పన్నులు చెల్లించాలని అధికారులు కోరినప్పుడు కోర్టులను ఆశ్రయిస్తూ కాలయాపన చేయడం సరికాదని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా సంస్థకు తామే పన్ను మినహాయింపు ఇచ్చుకున్నారా? అంటూ ప్రశ్నించారు.
కాలుష్యంపై వచ్చిన ఆరోపణలను పరిశీలించి, ఆంధ్రా పేపర్స్ మిల్లుపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సమన్స్ జారీ చేసి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
