
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిల్వలను ఎక్కడ ఉంచాలనే అంశంపై మరోసారి దృష్టి సారిస్తున్నాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని దేశాలు బంగారాన్ని స్వదేశానికి తరలిస్తుంటే.. మరికొన్ని అంతర్జాతీయ ట్రేడింగ్ కేంద్రాల్లో నిల్వలను పెంచుకుంటున్నాయి.
లండన్‌కు నెదర్లాండ్స్ బంగారం
నెదర్లాండ్స్ కేంద్ర బ్యాంకు 2026 మార్చి-ఆగస్టు మధ్య సుమారు 86 టన్నుల బంగారాన్ని న్యూయార్క్, ఒట్టావా నుంచి లండన్‌కు తరలించింది. ఇందులో 78 టన్నులకు పైగా న్యూయార్క్ నుంచి, 7 టన్నులు ఒట్టావా నుంచి తరలించారు. ప్రస్తుతం నెదర్లాండ్స్ వద్ద 612.4 టన్నుల బంగారం ఉంది.
భౌగోళిక, రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ కేంద్ర బ్యాంకు తెలిపింది. భౌతిక బంగారం ట్రేడింగ్‌కు లండన్ ప్రధాన కేంద్రం కావడంతో.. అవసరమైనప్పుడు బంగారాన్ని త్వరగా విక్రయించడం లేదా ఇతర లావాదేవీలకు ఉపయోగించడం సులభమవుతుందని పేర్కొంది.
ఫ్రాన్స్దీ అదే బాట
ఫ్రాన్స్ కూడా న్యూయార్క్‌లోని 129 టన్నుల బంగారాన్ని యూరప్‌కు మార్చింది. ఆ బంగారం LBMA నిర్దేశించిన 99.99 శాతం స్వచ్ఛత ప్రమాణాలకు సరిపోలకపోవడంతో.. వాటిని తరలించి కరిగించే బదులు విక్రయించి, అదే విలువకు సమానమైన ప్రమాణాలు కలిగిన బంగారాన్ని యూరప్‌లో కొనుగోలు చేసింది. ఫ్రాన్స్ వద్ద మొత్తం 2,437 టన్నుల బంగారం ఉంది.
భారత్ పరిస్థితి భిన్నం
భారత్ మాత్రం బంగారం నిల్వలను స్వదేశంలోనే ఉంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. RBI గణాంకాల ప్రకారం 2026 మార్చి నాటికి భారత్ వద్ద 880.52 టన్నుల బంగారం ఉంది. ఇందులో దాదాపు 77 శాతం దేశంలోనే ఉండగా.. విదేశాల్లో 200.47 టన్నులు ఉన్నాయి.
2025 మార్చి నాటికి దేశంలో 511.98 టన్నులు, విదేశాల్లో 367.60 టన్నుల బంగారం ఉండేది. అంటే ఏడాది వ్యవధిలో దేశంలో నిల్వ చేసిన బంగారం సుమారు 168 టన్నులు పెరిగింది.
