
పశ్చిమగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తణుకుకు చెందిన నంబూరి శ్రీనివాస్ కుటుంబం యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకింది. శ్రీనివాస్, ఆయన భార్య పద్మిని, కుమారుడు, కుమార్తె రెండు బైక్‌లపై బ్రిడ్జి వద్దకు వచ్చి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది.
వెంటనే గమనించిన జాలర్లు నలుగురిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పద్మినిని కాపాడారు. ఆమెను తొలుత పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం తణుకు ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్‌తో పాటు ఇద్దరు పిల్లల ఆచూకీ కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే కుటుంబం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన పద్మిని నుంచి పోలీసులు వివరాలు తెలుసుకుంటున్నారు.
గత నెలలోనూ ఇదే ప్రాంతంలో ఘటన
చించినాడలో గత నెలలోనూ ఇలాంటి విషాద ఘటన జరిగింది. తణుకు మండలం వేల్పూరుకు చెందిన దొడ్డా ధనసాయికృష్ణ, శిరీష దంపతులు భీమవరంలో నివాసం ఉంటున్నారు. సాయికృష్ణ డ్రైవర్‌గా పనిచేసేవాడు. భార్య, ఐదేళ్ల కుమారుడితో కలిసి బైక్‌పై చించినాడ వంతెన వద్దకు వచ్చారు.
వంతెన వద్ద బైక్‌ను నిలిపి, కుమారుడిని అక్కడే ఉంచి దంపతులు గోదావరిలోకి దూకారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి ఇచ్చిన ఉంగరాన్ని సాయికృష్ణ తిరిగి ఇవ్వకపోవడంతో వివాదం తలెత్తింది. ఆ వ్యక్తి మరికొందరితో కలిసి సాయికృష్ణ కుటుంబంతో గొడవకు దిగినట్లు వారు తెలిపారు. ఈ ఒత్తిడి కారణంగానే దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
అయితే సాయికృష్ణ ఆత్మహత్యకు ముందు మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో, ఘటనకు రెండు రోజుల ముందు ఆయన చేసినట్లు ప్రచారంలో ఉన్న వీడియో కూడా వైరల్ అయ్యాయి. చివరి నిమిషంలో కుమారుడిని వదిలేసి దంపతులు మాత్రమే గోదావరిలోకి దూకినట్లు సమాచారం.
