ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల అమలుకు కుటుంబాన్ని ప్రాథమిక యూనిట్‌గా పరిగణించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భవిష్యత్తులో అన్ని సంక్షేమ పథకాలను ఫ్యామిలీ యూనిట్‌గానే అమలు చేసేలా విధానాలు రూపొందించాలని సూచించారు.

8వ కలెక్టర్ల సమావేశం రెండో రోజు శుక్రవారం సూపర్-6 పథకాల అమలుపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. కొత్త పెన్షన్ల మంజూరుకు ముందే కుటుంబాల మ్యాపింగ్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే ప్రస్తుతం ఉన్న లబ్ధిదారులను యథాతథంగా కొనసాగిస్తూ ఈ ప్రక్రియను చేపట్టాలని స్పష్టం చేశారు.

రేషన్, పెన్షన్ల వంటి సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం పెద్ద కుటుంబాలు చిన్న కుటుంబాలుగా విడిపోవడం సరికాదని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ ప్రయోజనాల కోసం కుటుంబాలను విభజించకుండా.. పెద్ద కుటుంబాన్ని ఒక యూనిట్‌గా గుర్తించి, ఆ కుటుంబానికి మరింత ప్రయోజనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

కుటుంబ సాధికారతే ప్రభుత్వ విధానమని, దీనికి అనుగుణంగానే పాలసీలు, కార్యాచరణ ఉండాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. కుటుంబాల సమగ్ర మ్యాపింగ్‌తో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

By Ramya