ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ ప్రకారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఈ నెల 15న పోలీసు నియామకాలను మినహాయించి, APPSC ద్వారా భర్తీ చేయనున్న ఉద్యోగాలకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. పోస్టుల సంఖ్య, దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల షెడ్యూల్‌ వివరాలను ఇందులో వెల్లడించనున్నారు.

అక్టోబర్ మొదటి వారంలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇందులో సిలబస్, రిజర్వేషన్ రోస్టర్, అర్హతలు తదితర వివరాలు ఉంటాయి. అభ్యర్థుల వయసును జూలై 1 నాటికి పరిగణనలోకి తీసుకోనున్నారు.

గ్రూప్-1లో 167 పోస్టులు

గ్రూప్-1 పోస్టుల జాబితాను ప్రభుత్వం సవరించింది. కొత్తగా మూడు పోస్టులను చేర్చడంతో పాటు మరికొన్ని పోస్టుల్లో మార్పులు చేశారు. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ పోస్టులను మల్టీజోన్ పోస్టులుగా మార్చారు. తాజా మార్పులతో గ్రూప్-1లో మొత్తం 167 పోస్టులు భర్తీ చేయనున్నారు.

పరీక్షల నిర్వహణపై నిర్ణయం

గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలను మాన్యువల్‌గా నిర్వహించనున్నారు. ఇతర నియామక పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఆన్‌లైన్ పరీక్షల్లో నార్మలైజేషన్ విధానంపై నిపుణులతో అధ్యయనం చేస్తున్నారు.

రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 ప్రకారం 26 జిల్లాలకు ఆరు జోన్లు, రెండు మల్టీజోన్లు అమల్లోకి వచ్చాయి. ప్రత్యక్ష నియామకాల్లో 95% ఉద్యోగాలు స్థానికులకు, 5% ఓపెన్ కేటగిరీకి కేటాయించనున్నారు.

మరో కీలక నిర్ణయం

మత్స్యశాఖలో పనిచేస్తున్న 32 మంది MPEOల సేవలను వచ్చే ఏడాది మార్చి వరకు ప్రభుత్వం పొడిగించింది. వీరికి నెలకు రూ.12 వేల చొప్పున చెల్లించనున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన చట్ట సవరణను గెజిట్‌లో ప్రచురించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *